నాకు నచ్చే మధురవాణి.


ఎప్పుడూ వేటకారమేనా అప్పుడప్పుడు విషయం ఉన్న పోస్టులు కూడా రాయాలబ్బా అనిపించింది అందుకే ఈ టపా .

నాకు నచ్చే గురజాడ గారి నాటకాల్లో కన్యా శుల్కం ఒకటి.

ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలోని పాత్రలు సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది.

గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక. మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్ని తెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి, ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు.

నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర మధురవాణి. పాత్రలో అసాధారణత, పరిణామం, శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది.
ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా అని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది.

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది.
విమర్శనాఙ్ఞానం, విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. వాళ్ళను పొగుడుతుంది.
తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది.
ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ,
అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.

ఆమె సంస్కారవతి. దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్న శిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి,
సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది.
కరటక శాస్త్రితో వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని
"మధురవాణికి " దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?
అనడం ప్రత్యక్షర సత్యం.

నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ, లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది.
ఆహా! ఏమి యోగ్యమైన మనిషి
అని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు.

డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి.
కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే
యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో
అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది.
దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.

ఇవ్విధముగా నాకు నచ్చిన నాటకం కన్యాశుల్కం,నాకు నచ్చిన పాత్ర "మధురవాణి" అయింది..
అని చెప్పుటకు సంతోషిస్తూ
ప్రస్తుతానికి ఉంటాను..

అప్పటి మధురవాణి ఐటం సాంగ్ చూడండి.




9 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మధురవాణి పాత్రని చాలా బాగా విశ్లేషించారు. బాగుంది..సందీప్ గారు.

జలతారు వెన్నెల చెప్పారు...

I watched "kanyaashulkam" movie so many times, and I really fell in love with "madhuravaani's character. Thanks for reminding her.

sandeep చెప్పారు...

@ వనజవనమాలి గారూ

@జలతారు వెన్నెలగారూ

మన కొత్త బ్లాగర్లందరమూ మధురవాణి బుట్టలో భలే పడిపోయామే ...
అదేనండీ మనందరికీ ఒకేలాగా మధురవాణి నచ్చిందే అంటున్నాను :):):)

sandeep చెప్పారు...

టపా నచ్చినందుకు , నన్ను మెచ్చినందుకు ధన్యవాదాలు :):)

Zilebi చెప్పారు...

మధుర వాణి అంటే,
మన బ్లాగ్ లోకపు
మధుర వాణి గారేమో నని
వచ్చానండోయ్ !

చీర్స్
జిలేబి.

sandeep చెప్పారు...

ఏమండీ జిలేబీ గారూ బ్లాగు లోకపు మధురవాణి తప్ప
ఇంకొక మధురవాణి గారి గురించి రాస్తే చదవరా తమరు

ఎందుకండీ ఇంత సీ ... జూ వివక్ష మీకు

హతవిధీ ఈ బ్లాగర్లు మారరా????

అజ్ఞాత చెప్పారు...

Really good

రసజ్ఞ చెప్పారు...

వావ్ సందీప్ గారూ! మీరేనా? ఎంత బాగా రాసారో? నాకు మొదట్లో నచ్చేది కాదు కాని చూసిన కొద్దీ తెగ నచ్చేసిన పాత్ర మధురవాణి.

sandeep చెప్పారు...

రసజ్ఞ గారూ నేనేనండీ! బాగున్నారా??
నా పోస్ట్ ,నేను రాసిన విధానం నచ్చినందుకు థాంక్స్.
చూశారా మధురవాణి మిమ్మల్ని కూడా మెల్ల మెల్లగా బుట్టలో పడేసింది:):):)

కామెంట్‌ను పోస్ట్ చేయండి